దిల్లీలోని సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ కొవిడ్ ఆసుపత్రి వార్డులకు గల్వాన్ ఘర్షణలో అమరులైన వీర జవాన్ల పేర్లు పెట్టాలని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) నిర్ణయించింది. ఈ మేరకు డీఆర్డీఓ ఛైర్మన్ సాంకేతిక సలహాదారు సంజీవ్ జోషి తెలిపారు.
జూన్ 15న లద్దాఖ్ వద్ద జరిగిన సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటనలో చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం సంభవించింది.
అమిత్‌షా చేతుల మీదుగా
దిల్లీలో కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ కొవిడ్ ఆసుపత్రిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ఆదివారం ప్రారంభించనున్నారు.
కర్నల్ సంతోష్‌బాబు పేరుతో..
వెయ్యి పడకల ఈ ఆసుపత్రిలో... పూర్తి ఎయిర్ కండిషన్‌తో కూడిన ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పడకలు కూడా ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలోని ఐసీయూ, వెంటిలేటర్ వార్డుకు.. అమరవీరుడు కర్నల్ బి.సంతోష్‌బాబు పేరు పెట్టారు.
10,000 పడకల ఆసుపత్రి
దిల్లీ-హరియాణా సరిహద్దుకు సమీపంలోని ఛతార్పుర్ ప్రాంతంలోని రాధాస్వామి సత్సంగ్ బియాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొవిడ్ 19 ఆసుపత్రి దిల్లీలోనే అతిపెద్దది. ఇందులో ఒకేసారి 10 వేల మందికి చికిత్స అందించవచ్చు.
ఈ ఆసుపత్రిలో కరోనా రోగులకు... వైద్య సిబ్బందితో పాటు 2 వేలకు పైగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సెంట్రల్ ఆర్మ్ పోలీసు ఫోర్స్ (సీఏపీఎఫ్) సిబ్బంది కూడా సేవలందిస్తున్నారు.
ఇదీ చూడండి: 'చైనా, పాక్ విద్యుత్తు పరికరాలు దిగుమతి చేసుకోం'