ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్థి సంస్థ (డీఆర్డీఓ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణకు అవసరమైన 108 వ్యవస్థలు, ఉప వ్యవస్థలను దేశీయంగానే పరిశోధన, అభివృద్ది, తయారీ చేయాలని నిర్ణయించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్‌తో జరిగిన భేటీలో ఈ కీలక నిర్ణయాన్ని డీఆర్డీఓ ప్రకటించింది.
సాంకేతిక పరిజ్ఞాన జాబితా
దేశీయ రక్షణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆత్మ నిర్భర భారత్ కింద అనేక కార్యక్రమాలు చేపట్టాలని డీఆర్డీఓ నిర్ణయించింది. భారత పరిశ్రమల రూపకల్పన, అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞాన జాబితాను రూపొందించింది. అవసరాల ఆధారంగా ఈ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, పరీక్షల కోసం పరిశ్రమలకు పూర్తి మద్దతు ఇవ్వనుంది డీఆర్డీఓ. భారతీయ పరిశ్రమల నుంచి గుర్తింపు పొందిన ఉత్పత్తులను తీసుకోవాలని కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయనుంది. క్లిష్టమైన, అధునాతన సాంకేతికతలు, వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి డీఆర్డీఓకే పూర్తి అవకాశం ఉంది.
అభివృద్ది పరిచిన పరిజ్ఞానం, పరికరాల ఉత్పత్తిపై ఇప్పటికే పరిశ్రమలతో డీఆర్డీఓ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం 1800 ఎంఎస్‌ఎంఈలతో పాటు రక్షణ రంగ సంస్థలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, పెద్ద ఎత్తున పరిశ్రమలతో డీఆర్డీఓ ఒప్పందాలు చేసుకుంది.
ఇదీ చూడండి:సెప్టెంబర్ 1 నుంచి మెట్రో రైల్ సర్వీసులు!