చంద్రయాన్-2 విఫలమైందన్న వార్తలను రక్షణ పరిశోధన- అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ ఛైర్మన్ జీ. సతీశ్ రెడ్డి ఖండించారు. ఏ శాస్త్రీయ పరిశోధనల్లోనైనా సమస్యలు తప్పవని తెలిపిన్ సతీశ్... ఇస్రో శాస్త్రవేత్తల శ్రమను ప్రశంసించారు.
"ఇదొక ఎదురుదెబ్బ అనడాన్ని నేను అంగీకరించను. చంద్రయాన్-2 ఎంతో క్లిష్టమైన మిషన్. విజయానికి 99శాతం చేరువైంది. కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. నా వరకు ఇదొక ఘన విజయం. ఏ శాస్త్రీయ ప్రయాత్నాల్లోనైనా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇక్కడ మనం దేశం సాధించిన సాంకేతిక సామర్థ్యాన్ని గుర్తించాలి. శాస్త్రవేత్తలు ఏం సాధించారో చూడాలి. అందుకే ఇది భారత్‌కు గొప్ప విజయం అని భావిస్తున్నా. ఇది అంతరిక్ష విభాగంలో దేశానికి సుధీర్ఘ కాలంలో మార్గనిర్దేశకం అవుతుంది."
---- జీ. సతీశ్ రెడ్డి, డీఆర్డీఓ ఛైర్మన్.
శనివారం.. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపించని నేపథ్యంలో భావోద్వేగానికి లోనైన ఇస్రో ఛైర్మన్ కే. శివన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. దీనిపై స్పందించిన డీఆర్డీఓ ఛైర్మన్.. శాస్త్రవేత్తలకు మోదీ ఇచ్చిన భరోసాపై హర్షం వ్యక్తం చేశారు. మోదీ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇస్రో శాస్త్రవేత్తలు తిరిగి పనిచేయడం మొదలుపెట్టి.. విక్రమ్‌ను కనుగొన్నారని అభిప్రాయపడ్డారు.
భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలపై పాకిస్థాన్ మంత్రులు చేస్తున్న దుష్ప్రచారాలను సతీశ్ రెడ్డి తిప్పికొట్టారు. చంద్రయాన్-2 వంటి క్లిష్ట మిషన్లను అర్థం చేసుకునే సామర్థ్యం వారికి లేదని విమర్శించారు.
ఇదీ చూడండి:- విక్రమ్ కనిపించింది.. ఆశలు చిగురించాయి