పౌరసత్వ సవరణ చట్టం అంశంపై మాట్లాడేదేమీ లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీనిపై మోదీతో చర్చించలేదని స్పష్టం చేశారు. సీఏఏ భారత అంతర్గత విషయమని... ప్రజలకు మేలు చేసే నిర్ణయాలే భారత్ తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ పాకిస్థాన్‌ల మధ్య కశ్మీర్ అతి పెద్ద సమస్యగా ఉందని పేర్కొన్నారు. రెండు దేశాల ప్రధానులతో మంచి సంబంధాలున్నాయన్న ట్రంప్... ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు తనను ఆహ్వానిస్తే మధ్యవర్తిత్వ సాయం చేస్తానని మరోసారి ఉద్ఘాటించారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో దిల్లీ వేదికగా నేడు సమావేశమయ్యారు ట్రంప్. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
"ఇమ్రాన్ ఖాన్‌తో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది సమస్య కాదన్న ప్రశ్నే లేదు. కానీ దీనిపై వారు(రెండు దేశాలు) పనిచేస్తున్నారు. నేను ఏ సహాయం చేయడానికైనా సిద్ధమే. ఎందుకంటే ఇద్దరితో(మోదీ, ఇమ్రాన్ ఖాన్) నాకు మంచి సంబంధాలున్నాయి. మధ్యవర్తిత్వమైనా, సహాయమైనా నావల్ల అయింది చేయడానికి సిద్ధమే. కశ్మీర్‌పై వారు పనిచేస్తున్నారు. కశ్మీర్ సమస్యను ప్రజలు ఓ ముల్లులా భావిస్తున్నారు. ప్రతీ సమస్యకు రెండు పార్శ్వాలుంటాయి. ఉగ్రవాదంపైనా మేం చర్చించాం. ఉగ్రవాదానికి మోదీ చాలా వ్యతిరేకం. ఉగ్రవాదం విషయం ఆయన(మోదీ) చూసుకుంటారు."-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
మతస్వేచ్ఛకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలని మోదీ కోరుకుంటున్నట్లు వెల్లడించారు.