బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో అధికారాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు.
గతవారం మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ రెండు లేఖలు సంధించారు ధన్కర్. దీనిపై స్పందిస్తూ 14 పేజీల సుదీర్ఘ లేఖతో గవర్నర్కు ప్రత్యుత్తరం పంపారు మమతా.
"ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై గవర్నర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. భారత రాజకీయ చరిత్రలో ఇంతవరకు జరగలేదు. నామీద, నా మంత్రులు, అధికారులపై మీరు చేస్తోన్న ఆరోపణలు, నిందలు అసాధారణం."
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
రాజ్యాంగ నిబంధనలను గవర్నర్ ఉల్లంఘించారని మమతా ఆరోపించారు. తన విధానాలతో గవర్నర్ ఏకీభవించాలని లేదని.. అయితే ప్రశ్నించే అధికారం ఆయనకు లేదని తీవ్రంగా బదులు ఇచ్చారు మమత.
"ఈ సంక్షోభ సమయంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించవద్దు. అధికారిక సమాచారం, ప్రభుత్వ చిహ్నాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం మీరు మానుకోవాలి."
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
కొన్ని రోజులుగా ధన్కర్, మమత మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కరోనా కట్టడి విషయంలో మమత ప్రభుత్వం లెక్కలను తారుమారు చేస్తోందని.. మైనారిటీ ఓట్లే లక్ష్యంగా పనిచేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఇటీవల వరుసగా లేఖాస్త్రాలను సంధించారు ధన్కర్.