వాట్సాప్ ప్రవేశపెట్టిన నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించడం ఐచ్ఛికమేనని, వాటితో ఏకీభవించకపోతే ఆ ప్లాట్ఫాం నుంచి వైదొలగాలని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వాట్సాప్ ఒక ప్రైవేట్ యాప్ మాత్రమేనని, అవసరమైతే ఇతర అప్లికేషన్లను ఉపయోగించుకోవాలని సూచించింది. వాట్సాప్ నూతన పాలసీని సవాల్ చేస్తూ ఓ న్యాయవాది దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
"ఇతర యాప్లు విధించే నిబంధనల(టర్మ్స్ అండ్ కండిషన్స్)ను గమనిస్తే మీరు వేటిని అంగీకరిస్తున్నారో తెలుసుకొని ఆశ్చర్యపోతారు. గూగుల్ మ్యాప్స్ సైతం మీ సమాచారం మొత్తాన్ని సేకరించి, సేవ్ చేసుకుంటుంది. మీరు(పిటిషనర్) చెప్తున్న ప్రకారం ఏ సమాచారం లీక్ అవుతుందో మాకు అర్థం కావట్లేదు. అదొక(వాట్సాప్) ప్రైవేట్ యాప్. నిబంధనలు అంగీకరించడం ఐచ్ఛికమే. అంగీకరించకండి. వేరే యాప్ వాడండి."
-దిల్లీ హైకోర్టు
వాట్సాప్ నూతన ప్రైవసీ వివాదాన్ని సమగ్రంగా పరిశీలించాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణను జనవరి 25కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: వాట్సాప్ నూతన విధానం- గోప్యతా హక్కుకు తూట్లు
కొత్త పాలసీ వినియోగదారుల గోప్యతా హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషనర్ వాదించారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండానే యూజర్ల యాక్టివిటీ మొత్తం వాట్సాప్కు తెలిసిపోతుందని అన్నారు.
అయితే ఫేస్బుక్, వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ పిటిషనర్ ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రైవేట్ చాట్లపై ఎన్క్రిప్షన్ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత పాలసీ బిజినెస్ యూజర్లకు సంబంధించినదే అని తెలిపారు.
ఇదీ చదవండి: వాట్సాప్ వద్దనుకుంటే.. ఈ యాప్లు ట్రై చేయండి!