కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జైళ్లలోని ఖైదీలను పెరోల్‌పై బయటకు పంపేందుకు అనుమతించింది సుప్రీం కోర్టు. ఇప్పటికే ఆ దిశగా పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది కేంద్ర హోంశాఖ. పెరోల్‌ను తమ హక్కుగా ఖైదీలు భావించకూడదని, అది కేవలం రాయితీ మాత్రమేనని స్పష్టం చేసింది. నిబంధనల మేరకు ఎంపిక చేసిన ఖైదీలకే పెరోల్ అర్హత కల్పించాలని సూచించింది. జైలు అనేది నేర వ్యవస్థలో ఒక భాగమని, దిద్దుబాటు పాలనా సంస్థ అని అభివర్ణించింది. రాష్ట్ర భద్రత, పౌరుల రక్షణపై తీవ్ర ప్రభావం పడుతుందనుకునే కరడుగట్టిన నేరస్థులకు పెరోల్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. మోడల్ జైలు మాన్యువల్-2016లోని పెరోల్, ప్రత్యేక సెలవు మార్గదర్శకాలను సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, డీజీలు, జైళ్లశాఖ ఐజీలకు లేఖలు రాసింది కేంద్ర హోంశాఖ.
ప్రస్తుత పరిస్థితుల్లో ఖైదీలను విడుదల చేసే క్రమంలో శిక్షా సమీక్షా బోర్డు, పెరోల్ మంజూరు కమిటీ సభ్యులుగా సైకాలజిస్ట్, క్రిమినాలజిస్ట్ వంటి నిపుణులను నియమించి, వారి సూచనలు తీసుకోవాలి. మోడల్ జైలు మాన్యువల్-2016, హోంశాఖ, ఎన్హెచ్ఆర్సీ, సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ..ఖైదీల పెరోల్, తాత్కాలిక విడుదలపై ఉన్న పద్ధతులు, విధానాలను సమీక్షించాలి. ప్రతి కేసును జాగ్రత్తగా, సమగ్రంగా పరిశీలించటం అవసరం. నేరస్థులకు పెరోల్ సాధారణంగా మంజూరు చేయొద్దు. లైంగిక నేరాలు, హత్యలు, పిల్లల అపహరణ, హింసకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సంబంధించిన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.
- కేంద్ర హోంశాఖ.
ఖైదీలకు పెరోల్ వంటి అంశాల్లో తీసుకునే నిర్ణయం చట్టాలను ఉల్లంఘించొద్దని స్పష్టం చేసింది కేంద్ర హోంశాఖ. ప్రతి కేసులో నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకోవాలని.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎప్పటికప్పుడు హోంశాఖకు నివేదించాలని ఆదేశించింది. పెరోల్‌పై విడుదలయ్యే ఖైదీలు తిరిగి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని విధాలుగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
ఇదీ చూడండి: మారని హస్తరేఖలు.. కుటుంబ పరిధి దాటని కాంగ్రెస్!