ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు సహా ఆమె కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. బంధువులు, ఆమె తరఫు న్యాయవాదితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా రాయ్‌బరేలిలో ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించారు. న్యాయవాదికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంపై ఓ మీడియా కథనాన్ని ఉటంకిస్తూ భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
"బేటీ బచావో-బేటీ పడావో. భారత మహిళల విద్య కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం. కానీ మిమ్మల్ని అత్యాచారం చేసిన వ్యక్తి భాజపా ఎమ్మెల్యే అయితే ప్రశ్నించకూడదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు
భాజపా ఎమ్మెల్యే కుల్దీప్ సెన్‌గర్ తనను 2017లో అత్యాచారం చేసినట్లు ఉన్నావ్‌కు చెందిన ఓ మైనర్ ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసంలో బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సీబీఐ దర్యాప్తునకు సిద్ధం: డీజీపీ
ప్రమాదంపై ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, ఆయన తమ్ముడు మనోజ్సింగ్తో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేశారు రాయ్‌బరేలి పోలీసులు. రోడ్డు ప్రమాదంపై సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు.
"లారీ వేగంగా వస్తోంది. అదే సమయంలో వర్షం వస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం రోడ్డు ప్రమాదంగానే భావిస్తున్నాం. కానీ పూర్తి స్థాయి, పారదర్శక దర్యాప్తునకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది."
-ఓపీ సింగ్, యూపీ డీజీపీ
ఇదీ చూడండి: ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన- అరెస్టు