రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు కుట్ర చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. నిరసనలు చేపట్టిన రైతు సంఘాలు తమ వేదిక దుర్వినియోగం కాకుండా నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. అన్నదాతల పట్ల ప్రభుత్వం సున్నితంగా ఉందని స్పష్టం చేశారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు వారి ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని వివరించారు.
"రైతుల అభ్యంతరాల పరిష్కారం కోసం రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపించాం. మరిన్ని చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల ముసుగులో అన్నదాతల ఉద్యమాన్ని నాశనం చేసేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. తమ ఉద్యమ వేదిక దుర్వినియోగం కాకుండా రైతు సోదరులు నిరంతరం నిఘా ఉంచాలని పిలుపునిస్తున్నా" అని తోమర్ ట్వీట్ చేశారు.
దిల్లీలోని సింఘూ, టిక్రి వద్ద కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో వేర్వేరు అభియోగాలతో అరెస్టు చేసిన రచయితలు, మేధావులను విడుదల చేయాలని కోరుతూ కొన్ని పోస్టర్లు అక్కడ కనిపించాయి. జేఎన్‌యూ విద్యార్థి నేతలు ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌ను విడుదల చేయాలన్న పోస్టర్లూ దర్శనమిచ్చాయి. అయితే తమ ఉద్యమంతో రాజకీయాలకు సంబంధం లేదని రైతులు అంటున్నారు.
ఇదీ చూడండి: చర్చలపై రైతులకు మరోమారు కేంద్రం విజ్ఞప్తి