కొంచెం ఆప్యాయంగా చూస్తే చాలు.. శునకాలు మనపై ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తాయి. యజమానికి ఆపద పొంచి ఉందన్న విషయం తెలిస్తే వాటి ప్రాణాలనూ పణంగా పెట్టడానికి సిద్ధపడతాయి. ఇలాంటి ఘటనే బంగాల్లో జరిగింది. యజమాని ప్రాణాల కోసం ఏకంగా చిరుతతోనే పోరుకు సిద్ధపడి విజయం సాధించింది ఓ శునకం.
అరుణ డార్జిలింగ్ నివాసి. నాలుగేళ్లుగా ఓ శునకాన్ని పెంచుకుంటోంది. పేరు 'టైగర్.'
ఈ నెల 14న రాత్రి వేళ ఇంటి కింద అంతస్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఒక చిరుత అరుణపై దాడి చేసింది. అది గుర్తించిన టైగర్.. వెంటనే ఆ మృగంతో సమరానికి దిగింది. టైగర్ ధైర్యాన్ని చూసి చిరుత పారిపోయింది. అరుణ గాయాలతో బయటపడింది.
"ఆ రోజు రాత్రి అసలు వెలుగు లేదు. మా అమ్మ ఇంటి కింది అంతస్తుకు వెళ్తుండగా చీకటిలో మెరుస్తున్న కళ్లను చూసింది. వెంటనే అరిచింది. నేను కిందకు పరిగెత్తా. ముందు పిల్లి అనుకున్నాం. కానీ అది చిరుత అని తెలిసి వెనక్కు పరిగెత్తాం. చిరుత మమ్మల్ని వెంబడించింది. అప్పుడు మా అమ్మ వెంటనే 'టైగర్.. టైగర్' అని అరిచింది. అది విన్న టైగర్ వెంటనే వచ్చింది. చిరుత అమ్మపై దాడి చేయడాన్ని చూసింది. తక్షణమే దానిపైకి ఎగిరింది. వారి పోరు కొంత సేపు సాగింది. అనంతరం చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ రోజు టైగర్ లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో అన్న ఆలోచనే ఎంతో ఆందోళకరంగా ఉంది."
--- అరుణ కుమార్తె.
దాడి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. అరుణ ఇంటి పరిసరాల్లో 'కెమెరా ట్రాప్'లు అమర్చారు. చిన్న ఆకు కింద పడినా ఈ కెమెరాలు గుర్తిస్తాయన్నారు.
ఇదీ చూడండి:- పురివిప్పి ఆడిన నెమళ్లు.. వర్షాలపై ప్రజల ఆశలు