దేశంలో ఆరు లక్షల మంది వైద్యుల కొరత ఉన్నట్లు అమెరికాలో చేసిన ఓ అధ్యయనంలో తేలింది. నైపుణ్యమున్న నర్సులూ 20 లక్షల మంది తక్కువగానే ఉన్నారని 'సెంటర్ ఫర్ డిసీస్ డైనమిక్స్ అండ్ పాలసీ' సర్వేలో పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బందికి సరైన శిక్షణ లభించకపోవడం వల్ల అందుబాటులో ఉన్న మందులనూ రోగులు పొందలేక పోతున్నారని సర్వే వెల్లడించింది.
వ్యాధికి తగిన ఔషధాలు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ... అధిక ధరల వల్ల వాటిని కొనలేకపోతున్నారని వివరించారు. భారతదేశంలో ఔషధాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని అభిప్రాయపడ్డారు. అధిక ఆరోగ్య వ్యయాలతో దేశంలోని దాదాపు 5 కోట్ల7 లక్షల మంది ప్రతీ సంవత్సరం పేదరికంలో కూరుకుపోతున్నారని సర్వే పేర్కొంది.
దేశంలో ప్రతి 10,189 మందికి ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. సరికొత్త యాంటీబయోటిక్స్ కనుగొన్నప్పటికీ రోగులకు అందేసరికి ఆలస్యం అవుతోందని సర్వే స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా మందులతో నయం చేయగలిగే జబ్బులతోనే 5 లక్షల 70 వేల మంది మృత్యువాతపడ్డారని తెలిపింది. ఇందులో అధిక శాతం మంది తక్కువ ఆదాయమున్న దేశాలకు చెందినవారని సర్వేలో పేర్కొంది.