రాజస్థాన్ కోటాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఆహార నాళం నుంచి.. దాదాపు 6 అంగుళాల టూత్బ్రష్ను బయటికి తీశారు వైద్యులు.
పళ్లు తోమేటప్పుడుడు టూత్ బ్రష్ మింగేశాడు ఆ వ్యక్తి.. అది కాస్తా వెళ్లి ఆహారనాళంలో ఇరుక్కుంది. ఇంకేముంది..ఏం తిందామన్నా బ్రష్ అడ్డుపడుతోంది. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జీర్ణాశయాంతర నిపుణులు డాక్టర్ కపిల్ గుప్తా పరీక్షలు నిర్వహించి బ్రష్.. ఆహార నాళంలో ఇరుక్కున్న సంగతి తెలిపారు.
మత్తు మందు ఇచ్చి... పది నిమిషాల్లో ఆహార గొట్టంలో నుంచి బ్రష్ లాగేశారు. ఆ తర్వాత 3 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపారు.
'ఆహార నాళం నుంచి బ్రష్ బయటికి తీయడమనేది పెద్ద సవాలే. బ్రష్ తీసే సమయంలో నాళం దెబ్బతినే ప్రమాదముంది. అందుకే, ఆచితూచీ బ్రష్ను బయటకు తీశాం.'
-డాక్టర్ కపిల్ గుప్తా, జీర్ణశయాంతర నిపుణులు