ఉత్తర్ప్రదేశ్లో ఓ అధికారి తనకు తానే జరిమానా విధించుకున్నారు. ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే తనతో పాటు ఇతర అధికారులపై 10 వేల రూపాయలు జరిమానాగా విధించారు.
జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలోని ఓ ఓవర్హెడ్ ట్యాంక్లో నుంచి నీరు వృథాగా పోవడాన్ని గమనించి తనకు తాను జరిమానా వేసుకున్నట్లు పాండే వ్యక్తిగత సహాయకుడు గౌరవ్ సింగ్ తెలిపారు. ట్యాంకు పొంగి పొర్లిన శబ్దాన్ని విని ఆయన నీటి వృథాని గమనించారని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై చింతిస్తున్నట్లు తెలిపారు గౌరవ్ సింగ్. కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి జరిమానాను సమానంగా పంచుకొని ట్రెజరీలో డిపాజిట్ చేస్తామని చెప్పారు.
నీటి వృథాని సహించేది లేదన్న శంకర్ పాండే... ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని కలెక్టరేట్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. నీటి పొదుపు అనేది ప్రస్తుతం దేశానికి ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు.