మహారాష్ట్రలో భాజపా నాయకత్వంపై అసమ్మతి రాగాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పార్టీలోనే ఉంటామని చెబుతూనే కొందరు నాయకులు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గోపీనాథ్ ముండే జయంతి వేదికగా..
గురువారం బీడ్ జిల్లాలో జరిగిన మాజీ కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే జయంతి కార్యక్రమాన్ని ఇందుకు వేదికగా వాడుకున్నారు. గోపీనాథ్ ముండే కుమార్తె, మాజీ మంత్రి పంకజా ముండే, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఏక్‌నాథ్ ఖడ్సేలు ఈ వేదికపై నుంచే రాష్ట్ర నాయకత్వం పట్ల తమకు ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘ఇది మా నాన్న పార్టీ. నేను ఎందుకు పార్టీని వీడాలి’’ అని పంకజా ముండే స్పష్టం చేసినా భాజపా కోర్‌కమిటీకి రాజీనామా చేసిన ఆమె, జనవరి 26వ తేదీ నుంచి గోపీనాథ్ ముండే ట్రస్ట్ ఆధ్యర్యంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలపడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
బుజ్జగింపులు..
మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్‌ను తీవ్రంగా విభేదిస్తున్న ఏక్‌నాథ్ ఖడ్సే గురువారం కూడా కమలనాథులపై విమర్శలకు దిగారు. వీరి అసంతృప్తిని చల్లార్చేందుకు భాజపా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోంది. గురువారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ బీడ్‌కు వెళ్లి వీరితో భేటీ అయ్యారు. ఆ తరవాత పంకజా ముండే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ‘'‘కొందరు వ్యక్తులపై ఎవరికైనా అసంతృప్తి ఉండొచ్చు. అయితే పార్టీకి నష్టం చేయాలని ఎవరూ ఆలోచించవద్దు' అని పాటిల్ అనడం గమనార్హం.
ఇదీ చూడండి: మీరు చేసే చర్మ దానం.. మరొకరికి ప్రాణ దానం!