కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ప్రసంగానికి విపక్షాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మోదీకి మద్దతు తెలపడం తన విధి అని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రకటించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు నైతిక బలంతో పోరాడాలన్న ప్రధాని సందేశాన్ని సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
జనతా కర్ఫ్యూ..
ఈ ఆదివారం తలపెట్టిన జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడం సహా.. మోదీ సూచనలను అమలు చేయడంలో పార్టీ కార్యకర్తలు సహకరిస్తారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. దూరదృష్టిగల నాయకుడిలా ప్రజలతో మాట్లాడి.. ఉత్తేజకరమైన సూచనలు ప్రధాని ఇచ్చారని కేంద్రమంత్రి జావడేకర్ ప్రశంసించారు.
విపక్షాల విమర్శలు..
మోదీ సందేశం.. దేశంలోని కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించే విధంగాను, కేంద్ర ప్రభుత్వ నిస్సాహాయతను చూపే విధంగా ఉందని కాంగ్రెస్ నేత మానిష్ తివారీ విమర్శించారు. కరోనాపై పోరాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మోదీ తన ప్రసంగంలో చెప్పకపోవడం దురదృష్టకరమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. మూసివేతల వల్ల పేద ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారని ఆయన తెలిపారు.
ఈ నెల 22న ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని నిన్న జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్..
కరోనా మహమ్మారిని అరికట్టే చర్యల్లో భాగంగా.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ... నేటి సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముందని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: 'సంకల్పం, సంయమనంతోనే కరోనాపై విజయం'