ఆగ్రాలోని తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం. మరణించిన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం షాజహాన్ ఈ సుందరమైన కట్టడాన్ని నిర్మించాడు. రాజస్థాన్‌లోని చురూ జిల్లాలోనూ ప్రేమకు చిహ్నమైన మరో కట్టడం కనిపిస్తుంది. భర్త జ్ఞాపకంగా ఓ భార్య నిర్మించిన ఈ కట్టడం కూడా చూసేందుకు తాజ్‌మహల్ లాగే ఉంటుంది. చనిపోయిన సేత్ హజారీమాల్ గుర్తుగా ఆయన భార్య సరస్వతీ దేవి, ఆమె దత్తపుత్రుడు కలిసి దుధ్వాఖారాలో దీన్ని 70 ఏళ్ల క్రితం కట్టించారు.
"సేత్ హజారీమాల్‌ను ఖననం చేసిన స్థానంలోనే ఈ కట్టడం నిర్మిచారు. ఇది కట్టి 71 ఏళ్లు కావస్తోంది."
-మురారీ శర్మ, పురోహితుడు
మార్బుల్ రాయిని ఉపయోగించి ఈ బిల్డింగ్ నిర్మించారు. రాళ్లను కలిపేందుకు ఎలాంటి కంకర, సిమెంటు వినియోగించలేదు. ఈ భవనంలోపల ధర్మశాల ఉంటుంది. పర్యటకులు ఇక్కడే బసచేసే అవకాశం కూడా ఉంది. కట్టడం ముందు, వెనకభాగాల్లో అందమైన ఉద్యానవనం ఉంటుంది. లోపల ఉన్న శివుని గుడిలో శ్రావణ మాసం, శివరాత్రి సమయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
"ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందిన మహాశివుడి ఆలయముంది. చుట్టుపక్కల ఉన్న శివాలయాల్లో ఇదే అతిపెద్దది."
-అనిల్ సింగ్, దుధ్వాఖారా వాసి
ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించినప్పుడు.. భోలే బాబా లింగాన్ని పరిమళ ద్రవ్యంతో అభిషేకించారట. ఆ ద్రవ్యాన్ని గ్రామస్థులు సీసాల్లో నింపుకుని, ఇళ్లలో దాచుకున్నారట. అప్పటినుంచి శ్రావణమాసం, శివరాత్రి సమయాల్లో ఇక్కడ శివుడికి ప్రత్యేక పూజలు జరుపుతారు.
"మా గ్రామంలో ఓ శివాలయం ఉంది. దానికి మినీ తాజ్‌మహల్ అని కూడా పేరు. శివరాత్రి, సావన్ సమయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు."
-నరేష్ కుమార్, స్థానికుడు
"ఈ ఆలయంలోకి ఎవరైనా రావచ్చు. మా ఊర్లోని ప్రతిఒక్కరూ దేవుడిని పూజించేందుకు ఇక్కడకు వస్తారు. శివరాత్రి రోజు కార్యక్రమాలు జరుపుతారు. ఊర్లోని ఆడా, మగా అంతా ఇక్కడ పూజల్లో పాల్గొంటారు."
- అనిత, దుధ్వాఖారా వాసి
సేత్ హజారీమాల్ సమాధి ఈ కట్టడంలో ఉంది. ఆయన భార్య సరస్వతీ దేవి విగ్రహం కూడా ఇక్కడ కనిపిస్తుంది. మినీ తాజ్‌మహల్ గుమ్మటాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. సరస్వతీ దేవి, సేత్ హజారీమాల్‌ల ప్రేమకు ఈ కట్టడం సాక్ష్యంగా నిలుస్తోంది. రాజస్థాన్‌కు చెందిన కళాకారుల సునిశిత కళకు సైతం అద్దం పడుతోంది.
ఇదీ చూడండి:భళా అనిపించే మీగడ బొమ్మలు