హరియాణా శాసనసభ ఎన్నికల నగారా మోగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రోహ్తక్లో భాజపా విజయ్ సంకల్స్ ర్యాలీలో పాల్గొన్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వ 100 రోజుల పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలను గుర్తుచేశారు మోదీ.
"ఎన్డీఏ ప్రభుత్వం వందరోజులు పూర్తిచేసుకుంది. 100 రోజుల్లో ఏం జరిగిందో కొంత మందికి అర్థం కావటం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత వారి మనసు కుదురుగా ఉండటం లేదు. ఈ వంద రోజులు... అభివృద్ధి, విశ్వాసం, దేశంలో పెద్ద పెద్ద మార్పులకు, నిర్ణయాలకు, నిబద్ధతకు, నిజాయితీకి ప్రతీకలు.
గడిచిన 100 రోజుల్లో భారీ నిర్ణయాలు తీసుకున్నాం. ప్రభుత్వంపై మీకు ఉన్న విశ్వాసంతో దేశ రక్షణ, సంరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద నిర్ణయాలు తీసుకోగలిగింది. ఉగ్రవాదుల నిర్మూలన, ముస్లిం మహిళల రక్షణ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి అనేక చట్టాలు తీసుకొచ్చాం. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వివిధ రంగాల సమన్వయంతో కార్యాచరణ ప్రారంభించాం. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల కోసం చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నిర్ణయాల ఫలితం రానున్న రోజుల్లో వస్తుంది. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
హరియాణా అభివృద్ధి కోసం గత ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషిని అక్కడి ప్రజలకు వివరించారు మోదీ.
ఇదీ చూడండి: అండర్ వరల్డ్ డాన్లు, అగ్రనేతలు జెఠ్మలానీ క్లయింట్లే!