భూభాగంపై ఏటికేడు పెరిగిపోతున్న జనాభా అవసరాలను తీర్చడానికి భారీ ఎత్తున పంటలు పండించాల్సి వస్తోంది. మనిషికి అవసరమైన చాలా వస్తువులు పంటల ద్వారానే లభిస్తున్నాయి. దీంతో రోజురోజుకూ నేలలు వాటి సారాన్ని కోల్పోతున్నాయి. మరోవైపు పర్యావరణంలో మార్పులు సంభవించి కరవు విలయతాండవం చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏడాది జూన్ 17న ప్రపంచ ఎడారీకరణ, కరవు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది. కరవు, ఎడారీకరణపై ప్రజల వైఖరిని మార్చాలని 2020 సంవత్సరానికి అజెండా రూపొందించుకుంది. 'ఫుడ్, ఫీడ్, ఫైబర్' అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
1994లో కరవు వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధికారికంగా గుర్తించింది. ప్రజలందరి సహకారంతో భూసార క్షీణత సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చనే ప్రధానాంశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది ఐరాస.
ప్రధాన ఉద్దేశం
- ప్రజలకు కరవు, ఏడారీకరణకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించడం.
- ఈ సమస్యను కలసికట్టుగా ఎదుర్కొవచ్చనే విశ్వాసాన్ని పెంపొందించడం.
- తీవ్రమైన కరవు పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశాల్లో ఐరాస చేపట్టిన కార్యక్రమాల అమలును వేగవంతం చేయడం
భారత్‌లో భూసార క్షీణత
స్పేస్ అప్లికేషన్ సెంటర్ గణాంకాల ప్రకారం... 2011-13 సంవత్సరాల నాటికి భారత్‌లోని 96.4 మిలియన్ హెక్టార్ల భూభాగం ఎడారీకరణ/భూసార క్షీణత ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. దేశం మొత్తం భూభాగంలో ఇది 29.32 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే 6.35 శాతం భూభాగంపై ఎడారీకరణ ప్రభావం ఉంది.
దేశంలో కరవు పరిస్థితులు
దేశంలోని భూభాగాలను ఐదు వర్గాలుగా విభజించి కరవు పరిస్థితులను అంచనా వేస్తోంది ప్రభుత్వం.
- దీని ప్రకారం 6.88శాతం ప్రాంతం సాధారణ కరవు కోరల్లో చిక్కుకుంది.
- 4.18 శాతం భూభాగంలో ఓ మోస్తరు కరవు పరిస్థితులు నెలకొన్నాయి.
- 2.30 శాతం భూభాగంలో మోస్తరు నుంచి తీవ్రమైన కరవు ఉంది.
- 1.83శాతం ప్రాంతాల్లో తీవ్రమైన కరవు నుంచి అత్యంత తీవ్రమైన కరవు పరిస్థితులు ఉన్నాయి.
- మరో 1.38 శాతం భూభాగంలో అసాధారణమైన కరవు ఉంది.
నివారణ చర్యలు..
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. 2030నాటికి భూసార క్షీణతను తటస్థ స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంతేగాక.. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని భూసార క్షీణత నుంచి పునరుద్ధరించాలని 2019 పారిస్‌లో జరిగిన ఐరాస సమావేశంలో భారత్ తీర్మానించింది.
కరవు నివారణ కోసం..
రెండు మిలియన్ హెక్టార్ల భూభాగంలో అడవుల పెంపకాన్ని చేపట్టేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విభాగమైన.. జాతీయ అటవీ పెంపకం, పర్యావరణ అభివృద్ధి బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం రూ.3,874 కోట్లను వెచ్చించనుంది.
వీటితో పాటు గ్రీన్ ఇండియా మిషన్, కాంపా, నగర్ వన్ యోజన వంటి పథకాలనూ కేంద్రం అమలు చేస్తోంది.
భూసారం పెంచేందుకు..
మరోవైపు భూసార క్షీణతను తగ్గించేందుకు ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డ్, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, ప్రధానమంత్ర కృషి సించాయీ యోజన, పర్ డ్రాప్ మోర్ క్రాప్ వంటి పథకాలను అమలు చేస్తోంది.