దిల్లీకి చెందిన ఓ మహిళ.. బ్రిటన్, భారత్ దేశాల అధికారులను పరుగులు పెట్టించింది. తనకు సహాయం చేయమని.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని.. ఏకంగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కే ఈ-మెయిల్ పంపించింది. చివరికి ఆమెను పట్టుకోవడానికి అర్ధరాత్రి వేళ దిల్లీ వీధులను అధికారులు జల్లెడ పట్టాల్సి వచ్చింది.
ఈ-మెయిల్లో..
రోహిణి సెక్టర్-21లో నివాసముంటున్న ఆ మహిళ ఈ నెల 26వ తేదీన.. తనకు సహాయం చేయమని బ్రిటన్ ప్రధానిని వేడుకుంది. లేఖలో ఆమె పేర్కొన్న వివరాలను పరిశీలిస్తే.. ఆ మహిళ మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అర్థమవుతుంది. మరో రెండు గంటల్లో సహాయం అందకపోతే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.
ఈ-మెయిల్ చూసిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం షాక్‌కు గురైంది. వెంటనే లండన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. వివరాలు తెలుసుకున్న రాయబార కార్యాలయం.. భారత విదేశాంగశాఖ అధికారులను సంప్రదించింది.
పరుగులు పెట్టిన పోలీసులు..
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన దిల్లీ అమన్ విహార్ పోలీస్ స్టేషన్ అధికారులు.. ఆ మహిళను ట్రేస్ చేయడానికి పరుగులు తీశారు. ఆమె నివాసాన్ని కనుగొనేందుకు ఇన్స్పెక్టర్ సత్యపాల్ సింగ్, ఎస్హెచ్ఓ రఘువీర్ సింగ్, ఏసీపీ అతుల్ వర్మ రంగంలోకి దిగారు.
అయితే.. ఫోన్ కాల్స్‌ను ఆ మహిళ ఎత్తకపోవడం వల్ల పరిస్థితులు క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటిగంటకు.. ఇంటింటికీ వెళ్లి జల్లెడపట్టడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న సెక్యురిటీ గార్డులను ప్రశ్నించారు. రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన అనంతరం చివరికి ఆ మహిళ ఉంటున్న అపార్ట్మెంటును కనుక్కోగలిగారు పోలీసులు.
ఆ తర్వాత కుడా పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. తలుపు తెరిచేందుకు ఆ మహిళ నిరాకరించింది. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు పోలీసులు. వాళ్లు వచ్చి 10నిమిషాల్లో తలుపును బద్దలుకొట్టారు. అయినప్పటికీ.. వారందరినీ వెళ్లిపొమ్మని ఆ మహిళ పదేపదే అరిచింది.
లేఖ రాసింది అందుకే..
కౌన్సిలింగ్ మొదలుపెట్టిన అనంతరం ఆమె ప్రవర్తనకు గల కారణాలు బయపడ్డాయి. వైవాహిక జీవితంలో సమస్యలు, ఆర్థిక సంక్షోభం వల్ల ఆ మహిళ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. తాను ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేసినట్టు.. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్టు ఆ మహిళ వెల్లడించింది. తన భర్త విడాకులిచ్చినట్టు పేర్కొంది. తీసుకున్న అప్పులు చెల్లించలేని స్థితిలో ఉన్నట్టు బాధపడింది. అందుకే బ్రిటన్ ప్రధానికి లేఖ రాసినట్టు తెలిపింది.
ఆమెను ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్సను అందించాలని మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ చికిత్స కోసం ఇద్దరు సైకాలజిస్ట్‌లు, ఓ వైద్యుడిని పిలిపించారు పోలీసులు.
ఇదీ చూడండి:- పోలీసులనే బెదిరించి అరెస్టు నుంచి తప్పించుకున్నాడు!