జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి నెలలో దిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. దిల్లీలోని పలు ప్రాంతాల్లో హింసను ప్రేరేపించడానికి భారీ ఎత్తున బస్సులను, 300 మంది మహిళలు సహా అధిక సంఖ్యలో పురుషులను కుట్రదారులు తరలించారని వెల్లడించారు. అందుకోసం వారికి భారీ మొత్తంలో సొమ్ము అందిందని తెలిపారు. దిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇటీవల 15 మందిపై అభియోగపత్రం దాఖలు చేశారు.
కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ ఇష్రాత్ జహాన్, కార్యకర్త ఖలీద్సైఫి, సస్పెండ్ అయిన ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్, జామియా మిలియా ఇస్లామియా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు షిఫా ఉర్ రెహమాన్, జామియా విద్యార్థి మీరన్ హైదర్ దిల్లీలో అల్లర్లు వెనుక ప్రధాన కుట్రదారులని పేర్కొన్నారు. వారు ఫిబ్రవరి 16,17 తేదిల్లో రాత్రిపూట సమావేశమై పలు ప్రాంతాల్లో అల్లర్లకు ప్రణాళిక రూపొందించారని తెలిపారు. ఈ అల్లర్లను ప్రేరేపించినందుకు వారికి రూ. 1.61 కోట్లు అందాయని అభియోగపత్రంలో పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం బ్యాంకు ఖాతాల ద్వారా, నగదు రూపంలోనూ వారికి అందిందని తెలిపారు. ఈ అల్లర్లలో సుమారు 53మంది మరణించగా, 200మందికి పైగా గాయపడ్డారు.
ఇదీ చూడండి: సరిహద్దుల నుంచి వైదొలగాల్సిందే!