దిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు మెజారిటీ అభ్యర్థులకు చేదు అనుభవాలను మిగిల్చాయి. పోటీచేసిన దిగిన 672 మంది అభ్యర్థుల్లో 529మందికి పైగా డిపాజిట్ కోల్పోయారు. ఈ మేరకు దిల్లీ ఎన్నికల కమిషన్ గణాంకాలు విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 63 మంది అభ్యర్థులూ ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి కృష్ణ తీరత్, నేతలు ఏకే వాలియా, హరూన్ యూసఫ్, పర్వేజ్ హష్మి, పూనం ఆజాద్ వంటి ప్రముఖుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం 529 మంది డిపాజిట్ కోల్పోయారు.
కాంగ్రెస్.. ఎదురుగాలి
గతంలో దిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన అనుభవం కాంగ్రెస్ సొంతం. అయితే తాజా ఫలితాల్లో కాంగ్రెస్ ఎంతమాత్రం పోటీని ఇవ్వలేకపోయింది. దివంగత షీలా దీక్షిత్ సారధ్యంలో మూడు సార్లు దిల్లీని పాలించిన కాంగ్రెస్ వరుసగా రెండోసారి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఒక్క స్థానంలోనూ గెలవలేక చతికలపడింది.
కాంగ్రెస్ బరిలోకి దిగిన 66 స్థానాలకు గాను 63 స్థానాల్లో ఐదుశాతం కంటే తక్కువ ఓట్లే పోలై డిపాజిట్లు గల్లంతైయ్యాయి. కేవలం మూడు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. దిల్లీ పీసీసీ అధ్యక్షుడు కుమార్తె శివాణి చోప్రా కేవలం 4965 ఓట్లలో తన డిపాజిట్‌ను కాపాడుకున్నారు. కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అభ్యర్థులు నలుగురు ఓటమి పాలయ్యారు.
బీఎస్పీ..
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) దిల్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో 68 మంది అభ్యర్థులను బరిలో దించింది. అయితే ఏ ఒక్క అసెంబ్లీ నియోజక వర్గంలోనూ డిపాజిట్లు దక్కలేదు. బీఎస్పీ అభ్యర్థికి కేవలం 674 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇదీ చూడండి: ఉద్యోగులకు తీపికబురు - ఇకపై వారానికి 5 పని దినాలే