దిల్లీలో ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న హెచ్చరికలు కలకలం రేపాయి. నిఘా వర్గాల సమాచారంతో రాజధానిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ప్రధాన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
దిల్లీలోకి ప్రవేశం...
జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు.. దిల్లీలోకి చొరబడ్డారని అక్కడి పోలీసు విభాగానికి నిఘా వర్గాలు హెచ్చరికలు పంపాయి. నగరంలో ఓ పెద్ద ఉగ్రదాడికి ప్రణాళిక వేసినట్లుగా అనుమానిస్తున్నారు.
సీలంపుర్, ఈశాన్య దిల్లీ, జామియా నగర్, పహడ్గంజ్ సహా పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందం బుధవారం విస్తృత సోదాలు నిర్వహించింది. కొంత మంది అనుమానితుల్ని నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.... వీరిని విచారిస్తున్నట్లు వెల్లడించారు. అయితే... ప్రత్యేక బృందం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
నిఘా నడుమ..
ఉగ్రదాడులపై హెచ్చరికలతో జనసందోహం ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు సూచించారు దిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్. రామ్‌లీలా ప్రాంతం మార్కెట్, ఆధ్యాత్మిక, పర్యటక ప్రదేశాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలిపారు.