అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 24న భారత్కు రానున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ట్రంప్ బస చేసే ఐటీసీ మౌర్య హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. దిల్లీ పోలీసులు, అమెరికా సీక్రెట్ సర్వీస్, ఇతర సంస్థలు సంయుక్తంగా భద్రతా చర్యలను చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
ట్రంప్ సందర్శించే అన్ని ప్రాంతాల్లోనూ దిల్లీ పోలీసులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ అముల్యా పట్నాయక్ చెప్పారు. కేంద్ర బలగాల సహకారంతో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐటీసీ మౌర్య హోటల్ వద్ద మూడు అంచెల భద్రత ఉండనున్నట్లు మరో సీనియర్ అధికారి తెలిపారు. ఆ హోటల్లో మొత్తం 438 గదులు ఉండగా.. ప్రతి అంతస్తులోనూ పోలీసులను మోహరించనున్నట్లు వెల్లడించారు.