దిల్లీ పోలీసు ప్రధానకార్యాలయం ముందు పోలీసు సిబ్బంది ఆందోళన చేపట్టారు. దిల్లీ తీస్ హజారీ న్యాయస్థానం వద్ద పోలీసులకు, న్యాయవాదులకు ఘర్షణ జరగడం, దీనిపై లాయర్లు నిరసన కార్యక్రమం చేపట్టడమే ఇందుకు కారణం. అనంతరం ఈ వివాదంపై పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఓ నివేదికను అందజేశారు.
శనివారం తీస్‌హజారీ కోర్టు వద్ద న్యాయవాదులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది పోలీసులు, పలువురు న్యాయవాదులు గాయపడ్డారు. దీనిపై దిల్లీ హైకోర్టు ఇప్పటికే జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. 6 వారాల్లో దీనిపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
సస్పెన్షన్, బదిలీలు
కోర్టు ఆదేశాల మేరకు దిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఇద్దరు ఏఎస్ఐలను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేశారు.
సమాన న్యాయం కావాలి
న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న దిల్లీకి చెందిన న్యాయవాదులు విధులు బహిష్కరించారు. దీనికి ప్రతిగా నేడు పోలీసులు కూడా నిరసన బాట పట్టారు. తమకూ సమాన న్యాయం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. తప్పుచేసిన న్యాయవాదులను శిక్షించాలని కోరారు. వీరిని ఆందోళన విరమింపజేయాలని కోరారు దిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్. శాంతియుతంగా ఉండాలని.. సమస్యల్ని పరిష్కరిస్తామని నచ్చజెప్పారు.
ఇదీ చూడండి: అయోధ్య తీర్పు దృష్ట్యా యూపీకి 4 వేల మంది బలగాలు