కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ-ఎన్సీఆర్లోని పాఠశాలలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యాలు కొన్ని సూచనలు చేశాయి. జలుబు, దగ్గు ఉంటే పిల్లలు బడికి రాకుండా తల్లిదండ్రులే చూసుకోవాలని పలువురు స్కూల్ ప్రిన్సిపాల్స్ కోరారు.
" చిన్నపాటి దగ్గు లేదా జలుబు ఉన్నట్లయితే మీ పిల్లల్ని బడికి పంపకుండా చూసుకోండి. ప్రతి అరగంటకోసారి విద్యార్థులు తమ చేతుల్ని శుభ్రం చేసుకునేలా చూడాలని మా సిబ్బందికి ఆదేశాలిచ్చాం. మీ పిల్లలతో పాటు ఇంట్లో ఉండే సామాను విషయంలో మీరు కూడా ఇలాగే చేయండి."
- మోనికా సాగర్, శివ్ నాడార్ స్కూల్ ప్రిన్సిపల్, గురుగ్రామ్
మాస్క్‌లు ధరిస్తే బాక్టీరియా..!
గురుగ్రామ్‌లోని ద్వారకా స్కూల్ యాజమాన్యం.. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే మాస్క్‌లు వేసుకునేలా బలవంతం చేయొద్దని సూచించారు. ఒకవేళ ఆరోగ్యవంతులైన వారు మాస్క్‌లు ధరిస్తే.. పదేపదే మాస్క్‌ను ముట్టుకోవాలని చూస్తారు. తద్వారా నోటి చుట్టూ బాక్టీరియా ఎక్కువై ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముందని హెచ్చరించారు.