దేశ రాజధాని దిల్లీలో మరో వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు అధికారులు. ఇది హస్తినలో మూడో కరోనా కేసు కాగా.. దేశవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 31కి చేరింది. బాధితుడు పలుమార్లు థాయిలాండ్, మలేసియా సందర్శించినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దిల్లీలో ఈ వైరస్ సోకిన వారంతా సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివిధ ఆస్పత్రుల్లో మిగతా వారు
మిగతా 30 మందిలో దిల్లీ మయూర్ విహార్‌కు చెందిన 45ఏళ్ల వ్యక్తి నిన్న కరోనా బారినపడ్డారు. ఆగ్రాకు చెందిన ఆతని బంధువులు ఆరుగురికి కూడా వైరస్ సోకింది. పశ్చిమ దిల్లీలో నివసించే పేటీఎం ఉద్యోగికి కూడా కొవిడ్-19 సోకింది. వారందరూ సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘజియాబాద్‌కు చెందిన మధ్య వయస్కుడికి నిన్న ఈ వ్యాధి సోకగా ప్రస్తుతం దిల్లీ రాంమనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 24ఏళ్ల హైదరాబాదీకి కూడా వైరస్ సోకింది. అతన్ని విడిగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారితోపాటు 16మంది ఇటలీ పర్యటకులు, వారి గైడ్‌కు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఓ ఇటాలియన్, అతని భార్య జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో, మిగితా 14మంది, వారి గైడ్‌ను చావ్లాలోని ఐటీబీపీ కేంద్రం నుంచి వేదాంత ఆస్పత్రికి తరలించారు.
మరో 9 విమానాశ్రయాల్లో స్క్రీనింగ్
కరోనా మహమ్మారి కేసులు వరుసగా నమోదు అవుతున్నందున జాతీయతతో సంబంధం లేకుండా అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా మెడికల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 21 థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఉండగా మరో 9 విమానాశ్రయాల్లోనూ వాటిని ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. అన్ని రాష్ట్రాలకు చెందిన వైద్యాధికారులు, రైల్వే ఆస్పత్రులు, రక్షణ, పారామిలిటరీ సిబ్బంది సహా 280మంది ఇందులో పాల్గొన్నారు.
ఇదీ చదవంది: ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి