రైలు సర్వీసుల నిర్వహణలో తొలిసారిగా ప్రైవేటు రంగం కాలుమోపనుంది. దిల్లీ-లఖ్‌నవూ మార్గం ఇందుకు ప్రయోగాత్మక వేదిక కానుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తేజస్ రైలు నిర్వహణ ప్రైవేటు ఆపరేటర్ చేతుల్లోకి వెళ్తుంది.
దిల్లీ-లఖ్‌నవూ మార్గంలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను 2016లో ప్రకటించారు. రైల్వే టైం టేబుల్‌లో చోటు దక్కినా ఇంకా నిరీక్షణ స్థితిలోనే ఉంది. ప్రస్తుతం ఈ రైలును ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆనంద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో పార్క్ చేసి ఉంచారు.
రెండు రైళ్లను ప్రైవేటు నిర్వాహకులకు అప్పగించాలని నిర్ణయించింది రైల్వే శాఖ. 100 రోజుల ఎజెండాలో భాగంగా తొలుత తేజస్‌ను గుర్తించారు. రెండో రైలును త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
రైళ్ల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలన్న నిర్ణయాన్ని రైల్వే కార్మిక, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఆందోళనకు దిగుతామని హెచ్చరించాయి.
తేజస్ విశేషాలు
- పూర్తిస్థాయి ఏసీ రైలు. అత్యాధునిక, సౌకర్యవంతమైన వసతులు
- 160 కి.మీ.వేగంతో పరుగులు
- ఎల్‌ఈడీ తెరలు, వైఫై సదుపాయం
- ఆహార పదార్థాలు ఆర్డరు మేరకు సరఫరా
- టీ, కాఫీలను విక్రయించే వెండింగ్ మిషన్లు
ప్రస్తుతం ముంబయి-కర్మాలి(గోవా), చెన్నై-మధురై మార్గాల్లో తేజస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. దిల్లీ-చండీగఢ్, దిల్లీ-లఖ్‌నవూ మార్గాల్లో తేజస్ సేవలు అందుబాటులోకి రావాల్సి ఉంది.
ఇదీ చూడండి: 'చమురు ధరలు పెంచితే సామాన్యుడి పరిస్థితి ఏంటి?'