నిర్భయ దోషుల ఉరిపై దిల్లీ కోర్టు విధించిన స్టేను కేంద్రం సవాలు చేసింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇదే అంశంపై నలుగురు దోషుల అభిప్రాయం కోరింది. ఈ పిటిషన్పై నేడు మరోమారు వాదనలు విననుంది. ఈ మేరకు అధికారులతో పాటు దోషులకూ నోటీసులు జారీ చేసింది.
వ్యాజ్యంలో...
నలుగురు నిర్భయ దోషుల ఉరిపై దిల్లీ కోర్టు స్టే విధించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కేంద్రం. న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకోవడానికి దోషులకు ఇదివరకే తగిన సమయం ఇచ్చినట్టు పిటిషన్లో పేర్కొంది. ఉరి నుంచి తప్పించుకోవడానికే దోషులు చట్టాన్ని దుర్వినియోగిస్తున్నారని, కోర్టులు, న్యాయవ్యవస్థనే అవహేళన చేస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విన్నవించారు.
విచారణ సందర్భంగా... న్యాయ ప్రక్రియను దోషులు ఓ 'వినోదాత్మక ప్రయాణం'గా పరిగణిస్తున్నారని మండిపడ్డారు మెహతా. ఉరిని ఆలస్యం చేయడానికి ఒకదాని వెనుక మరొక అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు.
నిన్నే 'ఉరి' తీయాల్సింది
నిన్న ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. కానీ దోషులకు న్యాయపరమైన అవకాశాలు ఇంకా ఉన్నాయని... శుక్రవారం సాయంత్రం ఉరిపై స్టే విధించింది దిల్లీ కోర్టు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం.
- ఇదీ చూడండి: బడ్జెట్ 2020 : మాంద్యంపై 'నిర్మల పద్దు' సమరశంఖం