నాలుగు సంవత్సరాల క్రితం నాటి కన్నయ్య కుమార్ దేశద్రోహం కేసు విచారణ కొనసాగింపునకు దిల్లీ సర్కారు అనుమతినిచ్చింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి అయిన కన్నయ్య కుమార్..2016 ఫిబ్రవరి 9న నిర్వహించిన ఓ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఈ కేసు విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గతవారం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు దిల్లీ పోలీసులు. కన్నయ్య కుమార్ విచారణకు సంబంధించిన దరఖాస్తు 2019 జనవరి 14 నుంచి పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు లేఖ రాయగా.. తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
దిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని.. అక్కడి భాజపా చీఫ్ మనోజ్ తివారీ స్వాగతించారు. రాజధానిలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే ఇలా చేశారేమో అని వ్యాఖ్యానించారు.
వారి ప్రయోజనాల కోసమే..!
ఈ అంశంపై స్పందించిన కన్నయ్య కుమార్.. దిల్లీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇంతకాలం కేసును తిరగతోడలేదని ఆరోపించారు. విచారణ వేగంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు కన్నయ్య. దేశద్రోహం కేసులు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో దేశానికి తెలపాలనుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.