మోటారు వాహనాల చట్టం-2019 అమల్లోకి వచ్చాక భారీ మొత్తంలో చలాన్లు విధిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. వాటితో పాటు కొంత ఆశ్చర్యం కలిగించేలా... సైకిల్‌కు, ఎద్దుల బండికి చలాన్లు జారీ చేసిన సందర్భాలూ విన్నాం. కానీ దిల్లీలో క్యాబ్లలోని ప్రథమ చికిత్స కిట్‌లో కండోమ్‌లు లేకపోతే జరిమానా విధిస్తున్నారన్న వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
చలాన్ల విషయాన్ని కొందరు డ్రైవర్లు ధ్రువీకరిస్తున్నా.. అవి క్యాబ్‌లో ఎందుకు అవసరమో తెలియదని చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులను అడిగితే నవ్వి ఊరుకుంటున్నారు తప్ప.. ఎందుకోసమనే విషయం వారికీ పూర్తి స్థాయిలో అవగాహన లేదని అంటున్నారు.
"ప్రథమ చికిత్స కిట్‌లో కండోమ్ ఉంది. అందులో కండోమ్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తున్నారు. అది ఎందుకు ఉపయోగపడుతుందని వారిని ఎప్పుడూ అడగలేదు. కానీ దానిని తీసుకెళ్లకుంటే జరిమానా విధిస్తున్నారు."
- రాజేశ్ యాదవ్, క్యాబ్ డ్రైవర్, దిల్లీ
దిల్లీ మోటర్ వాహనాల చట్టం-1993 ప్రకారం క్యాబ్‌లో తప్పనిసరిగా ప్రథమ చికిత్స కిట్ ఉండాలి. గాయమైనప్పుడు వేళ్లు, చేతులు, కాళ్లను శుభ్రం చేసేందుకు ఉపయోగపడే డ్రెస్సింగ్, టింక్చర్ ఐయోడిన్ సీసా, సాల్ వొలటైల్, పెద్దగా ఉండే బాడీ డ్రెస్సింగ్ వంటి వస్తువులు తప్పనిసరి. కానీ కండోమ్ గురించి ఆ చట్టంలో పేర్కొనలేదు. కేంద్ర మోటారు వాహనాల చట్టం-1989లోనూ దీని గురించి చెప్పలేదు. మరి ఎందుకు చలానా వేస్తున్నారనేది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.
ప్రథమ చికిత్స కిట్‌లో కండోమ్ ఎందుకు అందుబాటులో ఉంచాలో ట్రాఫిక్ పోలీసులు సరైన వివరణ ఇవ్వకపోయినా కొందరు క్యాబ్ డ్రైవర్లు అవి చాలా విధాలుగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.
" కారులోని ప్రెషర్ పైపు పగిలిపోయినప్పుడు కొంత సమయం వరకు లీకేజీని కండోమ్ నిరోధిస్తుంది. చాలా రోజుల పాటు దూర ప్రయాణాలు చేసినప్పుడు సురక్షితమైన లైంగిక సంబంధాలకు ఉపయోగపడుతుంది. కండోమ్ లేకుంటే చలానా వేస్తున్నారు. నేను జైపుర్ వెళ్లినప్పుడు ఈ కారణంతోనే జరిమానా చెల్లించాను."
- రమేశ్ కుమార్, క్యాబ్ డ్రైవర్, దిల్లీ.
ప్రస్తుతం ఈ విషయంపై కొంత గందరగోళం ఏర్పడింది. ఇప్పటి వరకు కండోమ్ లేదని చలానా వేశారని వినడమే తప్ప... ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు.
ఇదీ చూడండి: 'హౌడీ మోదీ'తో ఇద్దరికీ లాభమేనా? ఏం జరుగుతుంది?