దిల్లీ శాసనసభ సభాపతి రాం నివాస్ గోయల్ తనకు విధించిన జైలు శిక్షపై సవాల్ చేయనున్నట్లు తెలిపారు. చట్టం, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. స్థానిక కోర్టు ఉత్తర్వులపై సెషన్స్ కోర్టులో అప్పీల్ చేస్తానని విలేకర్లతో వెల్లడించారు.
2015లో ఓ భవన నిర్మాణదారు ఇంట్లోకి బలవంతంగా చొరబడిన కేసులో గోయల్‌కు అక్కడి స్థానిక కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. 2015 దిల్లీ శాసనసభ ఎన్నికలకు ఒక రోజు ముందు గోయల్, ఆయన మద్దతుదారులు సోదాల పేరుతో నిర్మాణదారు ఇంట్లోకి చొరబడ్డారు. దీనిపై అప్పట్లోనే కేసు నమోదు కాగా నాలుగేళ్ల తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
గోయల్‌తో పాటు కేసులో నిందితులైన ఆయన కుమారుడు సుమిత్ గోయల్ సహా మరో ముగ్గురికి కూడా ఇదే శిక్ష పడింది. జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరూ రూ.వెయ్యి జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే.. వారు స్థానిక కోర్టు ఉత్తర్వులపై సవాల్ చేసేందుకు వీలుగా ఒక్కొక్కరికి రూ. లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
గోయల్ తప్పుకోవాలి: భాజపా
అయితే ఈ అంశంలో దిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై భాజపా విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ అంశంపై స్పందించాలని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి గౌరవాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు ప్రతిపక్ష నేతలు. ఆయన రాజీనామా చేయాలని పట్టుబట్టారు. అయితే.. ఈ ఆరోపణల్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఆయన పీసీఆర్ కాల్ వచ్చిన అనంతరం.. ప్రత్యేక పోలీస్ బృందంతోనే వ్యాపారి ఇంట్లోకి వెళ్లారని స్పష్టం చేసింది.