కరోనా వైరస్ కారణంగా భారత్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రజల భయాందోళనల నేపథ్యంలో తాజా పరిస్థితులపై దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియాతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది. కరోనా వైరస్‌కు భయపడాల్సిందేమీ లేదని చెప్పారు గులేరియా. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
"భయపడాల్సిందేమీ లేదు. భారత్‌లో నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన లేదా వారితో కలిసిన వ్యక్తులకు సోకినవే. సమాజంలో ఇంకా వ్యాప్తి చెందలేదు. ఐరోపా సమాఖ్య, అమెరికా దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలోనే ఉన్నాం. దగ్గినప్పుడు టిష్యూ పేపర్లు ఉపయోగించాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. మాంసం తింటే వైరస్ వ్యాపిస్త్తోందని పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ రకంగా వైరస్ వ్యాపించదు."
-రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్
లక్షణాలు ఇవే..
కరోనా నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు గులేరియా. 'జ్వరం, జలుబు, గొంతులో ఇబ్బంది, దగ్గు, ఒళ్లు నొప్పులు మొదలైన లక్షణాలు కరోనా సోకిన వారిలో కన్పిస్తాయి. అయితే గత 14 రోజుల్లో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మీరు పర్యటించారా, బాధితులతో కలవడం వంటివి చేశారా అనే అంశాలను గమనించుకోవాలి. వ్యాధి నివారించేందుకు పలు జాగ్రత్తలు పాటించాల'ని గులేరియా పేర్కొన్నారు.
జాగ్రత్త వహించండి..
కరోనా రాకుండా ఉండేందుకు ఎక్కువమంది గుమిగూడే ప్రదేశాలకు వెళ్లకూడదని చెప్పారు రణ్‌దీప్ గులేరియా. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రయాణించవలసి వచ్చినప్పుడు శానిటైజర్లు, మాస్కులు ఉపయోగించాలని తెలిపారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.
విద్యాసంస్థల బంద్ మంచిదే..
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌పై సానుకూలంగా స్పందించారు గులేరియా.'ఇది ఆహ్వానించదగిన పరిణామమే. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ దశలో తీసుకోవాల్సిన నిర్ణయాలివే. పాఠశాలలు, కళాశాలల్లో ఎక్కువమంది గుమిగూడేందుకు అవకాశం ఉంది. ఈ కారణంగా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని' పేర్కొన్నారు.
ఎయిమ్స్ టాస్క్‌ఫోర్స్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎయిమ్స్ తీసుకున్న చర్యలను వివరించారు గులేరియా. 'వైరస్‌పై పోరాడేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం. ప్రత్యేక శిబిరాల ఏర్పాటు, కేసులు నమోదైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని' చెప్పారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 93 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 4వేలమంది వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఏడుగురిని చికిత్స అనంతరం డిశ్చార్జీ చేశారు.
ఇదీ చూడండి: భారత్‌లో 93కు చేరుకున్న కరోనా కేసులు