మూడు రోజుల రష్యా పర్యటనలో భాగంగా బయలుదేరి వెళ్లిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. మాస్కో చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను రష్యా మేజర్ జనరల్ కోసెంకో వాసిలీ అలెగ్జాండ్రోవిచ్, రష్యాలోని భారత రాయబారి డీబీ వెంకటేశ్ వర్మ స్వాగతం పలికారు.
నేడు జరిగే 75వ విక్టరీ డే సైనిక పరేడ్‌లో పాల్గొననున్నారు రాజ్‌నాథ్. అనంతరం.. భారత్-రష్యా రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా వివిధ స్థాయుల్లో చర్చలు జరపనున్నారు.
కీలక భేటీలు..
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న వేళ రాజ్‌నాథ్ మూడు రోజుల పాటు రష్యాలో పర్యటించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో రష్యాలోని కీలక రాజకీయ నాయకులతో రాజ్‌నాథ్ భేటీ కానున్నారు. లద్దాఖ్‌లో నెలకొన్న పరిస్థితులు, చైనా ఏర్పాటు చేసుకున్న స్థావరాలకు సంబంధించి వివరించనున్నట్లు సమాచారం.
ఈ పర్యటనలోనే యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, యుద్ధ ట్యాంకుల కోసం విడిభాగాలు, అనుబంధ పరికరాలను అత్యవసరంగా సరఫరా చేయాలని రష్యాను కోరనున్నట్లు తెలుస్తోంది. వాటితో పాటు వచ్చే ఏడాది చివరి నాటికి సరఫరా చేయాల్సిన ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థల పంపిణీని వేగవంతం చేయాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: రష్యాకు రాజ్‌నాథ్- అత్యవసర యుద్ధ సామగ్రి కోసమే!