ప్రపంచంలోని ఏ శక్తీ భారతభూమి నుంచి ఒక్క అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చర్చల ద్వారా మాత్రమే సరిహద్దు వివాదాలు పరిష్కారం అవుతాయని, ఇంత కంటే మరో మంచి మార్గం ఉండదని ఆయన అన్నారు. భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న వేళ... ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
"భారత్-చైనా సరిహద్దు వివాదం పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయి. అయితే అవి ఎంతవరకు ఫలవంతమవుతాయో నేను చెప్పలేను. కానీ నేను ఒక్క భరోసా ఇవ్వగలను. ప్రపంచంలోని ఏ శక్తీ భరతభూమి నుంచి ఒక్క అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదు."
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి
తూర్పు లద్దాఖ్ లేహ్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్... క్షేత్రస్థాయి సైనిక సన్నద్ధతను పరిశీలించారు. సరిహద్దు పరిస్థితులపై సర్వసైన్యాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే సహా ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.