వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైన్యం భారీగా మోహరించడం, ప్రతిగా భారత్ అదే స్థాయిలో బలగాలను సరిహద్దుకు తరలిస్తున్న నేపథ్యంలో.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లేహ్‌ను సందర్శించనున్నారు. తూర్పు లద్దాఖ్‌లో భద్రత, సైన్యం సన్నద్ధతపై సమీక్ష నిర్వహించనున్నారు రాజ్‌నాథ్. భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణే కూడా రాజ్‌నాథ్‌తో వెళ్లనున్నారు.
చైనాకు ముకుతాడు వేసే విధంగా ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న భారత ఆర్మీ.. సరిహద్దులో భద్రత చర్యలను మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది. 20 వేల మంది సైన్యాన్ని సరిహద్దులో చైనా మోహరించినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు దీటుగా సేనలను సరిహద్దుకు భారత్ తరలిస్తోంది.