పౌరసత్వ చట్ట సవరణను నిరసిస్తూ దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరింది. మంగళవారం వరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా.. కొన్ని గంటల వ్యవధిలోనే ఏడుగురు మృతి చెందటం దిల్లీలోని ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది.
మృతుల సంఖ్యపై దిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆస్పత్రి (జీటీబీ) ఓ ప్రకటన విడుదల చేసింది. లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి నుంచి నాలుగు మృతదేహాలను జీటీబీకి తరలించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీల్ కుమార్ తెలిపారు.
సైన్యాన్ని రంగంలోకి దింపాలి: కేజ్రీవాల్
ఈశాన్య దిల్లీలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పోలీసులు పరిస్థితులను అదుపు చేయలేకపోయారని, సైన్యాన్ని రంగంలోకి దింపాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
" నిన్న రాత్రంతా దిల్లీలోని ప్రజలతో కలిసి ఉన్నా. పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పరిస్థితులను అదుపు చేయలేకపోయారు. చేస్తారన్న నమ్మకం లేదు. సైన్యాన్ని రంగంలోకి దింపాలి. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో తక్షణమే కర్ఫ్యూ విధించాలి. ఈ పరిస్థితులపై కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తున్నా"
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
సీడబ్ల్యూసీ సమావేశం..
దిల్లీలో చెలరేగిన హింసపై చర్చించేందుకు కాంగ్రెస్ ఉన్నత స్థాయి నిర్ణాయక కమిటీ భేటీ అయ్యింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఆమె నివాసంలో సీనియర్ నేతలు సమావేశమయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్, ప్రియాంక గాంధీ, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోని హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్న కారణంగా సమావేశానికి హాజరుకాలేదు.
సీఏఏను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూ వస్తున్న కాంగ్రెస్.. తాజా అల్లర్ల నేపథ్యంలో భవిష్యత్‌లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించింది.
కాంగ్రెస్ నేతల ర్యాలీ..
పరిస్థితులను అదుపు చేయాలని కోరుతూ.. రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు దిల్లీ కాంగ్రెస్ నాయకులు. సీడబ్ల్యూసీ సమావేశానంతరం ర్యాలీ చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.