హిందూ ఉమ్మడి కుటుంబాల్లోని ఆస్తులపై కుమార్తెలకు కూడా సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. 2005 హిందూ వారసత్వ చట్ట సవరణకు ముందు తండ్రి మరణించినప్పటికీ.. ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. సమాన హక్కుల నుంచి మహిళలను దూరం చేయకూడదని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ నాజర్, జస్టిస్ ఎమ్ ఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు చారిత్రక తీర్పును వెలువరించింది.
"సెక్షన్ 6(1)ను ఉపయోగించుకుని.. 2005 సెప్టెంబర్ 9కి ముందు జన్మించిన కుమార్తె కూడా తన హక్కును పొందవచ్చు. ఈ సమాన హక్కు పుట్టుకతో వస్తుంది కాబట్టి.. 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉండాలన్న నిబంధన అవసరం లేదు."
--- సుప్రీంకోర్టు.
సవరణ తేదీ నాటికి కుమార్తె జీవించి లేకపోయినా.. ఆమె సంతానం చట్టపరంగా రావాల్సిన వాటాను కోరవచ్చని తాజా తీర్పులో పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం.
ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు కల్పిస్తూ.. హిందూ వారసత్వ చట్టం 1956కు చేసిన సవరణలతో పునరావృత్త ప్రభావం ఉంటుందా? లేదా? అన్న అంశంపై విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.
ఇదీ చూడండి:- 'వృద్ధులకు సకాలంలో పింఛను పంపిణీ చేయండి'