దేశ ఆర్థిక మందగమనంపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలిచ్చిన తీర్పును మోదీ ప్రభుత్వం 'అత్యంత ప్రమాదకర స్థాయిలో దుర్వినియోగం' చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ సీనియర్ నేతలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు సోనియా. కాంగ్రెస్ సంకల్పాన్ని, సహనాన్ని భాజపా పరీక్షిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కక్షసాధింపు రాజకీయాలు
ఆర్థిక మందగమనం వల్ల ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని సోనియా పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుంచి దేశం దృష్టిని మళ్లించేందుకే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని సోనియా ధ్వజమెత్తారు.
ఘనంగా.. 150వ గాంధీ జయంతి వేడుకలు
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల బాధ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం భారీ ప్రణాళికను సిద్ధం చేశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ఈ భేటీకి హాజరుకాకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి: చిదంబరం కస్టడీ ఇప్పుడు అవసరం లేదు:ఈడీ