టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా దిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి కారణంగా సాధారణ పరీక్షల కోసం వచ్చారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు వైద్యులు.
83 ఏళ్ల 14వ దలైలామా ధర్మశాలలో జరుగుతున్న గ్లోబల్ లెర్నింగ్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సమావేశంలో వృద్ధాప్యం, పునర్జన్మలపై ప్రసంగించారు. నలంద సంప్రదాయానికి కుమారుడినని పునరుద్ఘాటించారు.
60 ఏళ్లుగా ధర్మశాలలోనే...
1959 చైనీయుల టిబెట్ ఆక్రమణ సమయంలో పారిపోయి భారత్‌కు వచ్చారు దలైలామా. అప్పటి నుంచి ధర్మశాలలోనే నివాసముంటున్నారు. దలైలామా వారసుడి ఎంపికలో మత నిబంధనలు, చారిత్రక అంశాలతో పాటు అధికార కమ్యూనిస్టు ప్రభుత్వానికి లోబడి ఉండాలని చైనా చెబుతూ వస్తోంది.
త్వరగా కోలుకోవాలి: నవీన్ పట్నాయక్
"ఒడిశా ప్రజల తరఫున దలైలామా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రపంచానికి దలైలామా సేవలు ఎంతో అవసరం."
-నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి
ఇదీ చూడండి: చైనా వసంతానికి-మంచు వెన్నెల స్వాగతం