అత్యంత తీవ్ర తుపానుగా పేర్కొంటున్న 'ఫొని' ఒడిశాపై పడగ విప్పింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రాష్ట్రంలోని పూరీపై భీకర గాలులతో విరుచుకుపడింది. తుపాను ధాటికి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పూరీ, భువనేశ్వర్ జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో ఇద్దరు మరణించారు.
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పరిస్థితిని సమీక్షించారు. పూరీ జిల్లాకు అత్యంత నష్టం వాటిల్లింది.
భీకర గాలులు...
175 నుంచి 200 కిలో మీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు, వేలాది చెట్లు కూలిపోయాయి. భీకర గాలులకు పూరి, భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో పైకప్పులు ఎగిరిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
కుంభవృష్టి...
కుంభవృష్టి కారణంగా పూరీ సహా తీర ప్రాంత పట్టణాలు, గ్రామాల్లోని ఇళ్లు నీట మునిగాయి. మొబైల్ టవర్లు, భారీ విద్యుత్ స్తంభాలు కూలి భువనేశ్వర్ సహా పలుచోట్ల విద్యుత్, సమాచార వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. జోరువానతో పట్టాలు నీటమునిగాయి. భువనేశ్వర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద భారీ క్రేన్ కుప్పకూలింది.
ప్రయాణాలు రద్దు...
తుపాను కారణంగా కోల్‌కతా-చెన్నై మార్గంలో ప్రయాణించే 220కి పైగా రైళ్ల సర్వీసులు శనివారం వరకు రద్దయ్యాయి. భువనేశ్వర్ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిషేధించారు.
యుద్ధప్రాతిపదికన...
4 వేల మందితో కూడిన 81 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక యంత్రాంగం తుపాను సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విద్యుత్, సమాచార వ్యవస్థల పునరుద్ధరణకు మరికొన్ని రోజుల సమయం పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.
- ఇదీ చూడండి: ఒడిశాను వణికిస్తోన్న ప్రచండ గాలులు