అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని కూర్చొబెట్టుకొని 12 వందల కి.మీ సైకిల్ తొక్కిన బిహార్ బాలిక జ్యోతి కుమారి ఇప్పుడు ఫేమస్ స్టార్ అయిపోయింది. ఆమెలోని సైక్లింగ్ నైపుణ్యాన్ని గుర్తించిన భారత సైక్లింగ్ సమాఖ్య (సీఎస్‌ఎఫ్).. ట్రయల్స్‌కు ఆహ్వానించింది. ఇందుకోసం లాక్డౌన్ అనంతరం దిల్లీకి వెళ్లనుంది జ్యోతి.
సీఎఫ్ఐ తనను సైకిల్ పోటీలకు పిలవడం ఎంతో సంతోషంగా ఉందని ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జ్యోతి తెలిపింది. వచ్చే నెలలో ట్రయల్స్‌కు హాజరుకానున్నట్లు పేర్కొంది. ఆమె చదువుతో పాటు, ఇతర ఖర్చులన్నీ తామే చూసుకుంటామని సీఎఫ్ఐ చెప్పినట్లు జ్యోతి వెల్లడించింది. ఇదొక గొప్ప సదవకాశంగా భావిస్తున్నట్లు తెలిపింది.
బిరుదులతో సత్కారం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సైతం జ్యోతిపై ప్రశంసలు కురిపించారు. జ్యోతి గొప్పతనానికి మెచ్చి.. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక జన అధికార్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పప్పు యాదవ్ జ్యోతిని ప్రశంసిస్తూ రూ.20వేల బహుమతి ఇచ్చారు. ప్రభాత్ దాస్ ఫౌడేషన్ జ్యోతికి 'మిథిలా వీరంగ సమ్మాన్' బిరుదును ప్రదానం చేసి ఆమెకు జ్ఞాపికను బహూకరించింది.