పార్టీలో అంతర్గత కలహాలకు నాయకత్వ అంశమే కేంద్ర బిందువుగా మారుతున్న పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని సమావేశ పరచాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీ సోమవారం లేదా తర్వాత ఉండవచ్చని తెలుస్తోంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని ప్రయోగాత్మకంగా బహుశా శనివారమే చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
' ఏ క్షణంలోనైనా పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ చేపట్టే అవకాశం ఉంది. దీంతో తమ రాజకీయ భవిత గురించి సోనియా విధేయులైన కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియానే మరో ఏడాది పాటు కొనసాగాలని వారు కోరుకుంటున్నారు.' అని కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తెలిసిన ఓ నేత పేర్కొన్నారు.