ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఎంపీలందరూ నేడు సమావేశం కానున్నారు. ఈ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) భేటీలోనే నూతన లోక్‌సభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు.
యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. ప్రస్తుతం సీపీపీకి నేతృత్వం వహిస్తున్నారు. నేడు జరగనున్న సమావేశానికి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన 52 మంది లోక్‌సభ ఎంపీలతో పాటు.. పార్టీ రాజ్యసభ సభ్యులూ హాజరుకానున్నారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ భేటీ జరగనుంది. తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఇక్కడ చర్చించనున్నారు.
17వ లోక్‌సభ ఏర్పాటైన అనంతరం జరగనున్న కాంగ్రెస్ తొలి అధికారిక సమావేశం ఇదేనని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాహుల్ హాజరు...
సీపీపీ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా ప్రతిపాదన చేసిన అనంతరం జరగనున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
మే 25న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలోనే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా ప్రతిపాదన చేశారు. ఏకగ్రీవంగా తిరస్కరించిన కమిటీ.. అధ్యక్షుడిగా రాహుల్‌నే ఉండాలని కోరింది. అనంతరం.. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు, ఇతర పార్టీ నేతలూ రాహుల్ గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగాలని గళం వినిపించారు.