పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నిమజ్జనం చేసే విగ్రహాల తయారీలో ప్లాస్టిక్, థర్మాకోల్ , ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినియోగాన్ని నిషేధించింది.
వాటాదారుల అభిప్రాయ సేకరణ అనంతరం 2010 మార్గదర్శకాలను సవరించింది సీపీసీబీ. ప్రధానంగా రసాయనాలతో కాకుండా.. సహజమైన బంకమట్టి, రంగులను ఉపయోగించాలని ఉద్ఘాటించింది.
విగ్రహాలను సహజసిద్ధంగా, ఎటువంటి విషపూరిత పదార్థాలు వినియోగించకుండా.. పర్యావరణహితంగా తయారు చేయాలి. బంకమన్ను, బురద, గడ్డి... వంటి వాటిని ప్రోత్సహించాలి. ఇలాంటి విగ్రహాలకే అనుమతి లభిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను నిషేధిస్తాం.
---కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి.
విగ్రహాల ఆభరణాలు ఆకర్షణీయంగా కనిపించేలా.. ఎండిన పూలు, పండ్లు, ఆకులు, చెట్టు వేళ్లు వంటి పదార్థాలను వినియోగించాలని కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు జారీ చేసింది.
ఏటా గణేశ్ ఉత్సవాలు, దుర్గాష్టమి వంటి పండుగల్లో హానికరమైన రసాయనాలతో తయారు చేసిన విగ్రాహాలను నిమజ్జనం చేయడం వల్ల.. నీరు భారీగా కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది సీపీసీబీ.
మూడు దశల్లో చర్యలు...
గతంలో రూపొందించిన మార్గదర్శకాలతో ఫలితం లేకపోవడం వల్ల.. ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది సీపీసీబీ. ఈ క్రమంలోనే నీటి నాణ్యతను అంచనా వేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కమిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా టైర్-1 నగరాల్లో(లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగినవి) ప్రీ- ఇమ్మర్షన్(నిమజ్జనం ముందు), ఇమ్మర్షన్, పోస్ట్ ఇమ్మర్షన్ పద్దతిలో మూడు దశల్లో చర్యలు చేపట్టాలని సూచించింది.
పౌరుల నుంచే 'ఛార్జీ' వసూలు
పర్యావరణహితంగా విగ్రహాలను తయారు చేసే వినూత్న విధానాలను రూపొందించి, అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచడంలో జిల్లా యంత్రాంగానికి ఎస్‌పీసీబీ, పీసీసీ కమిటీలు సాయపడనున్నట్లు తెలిపింది. విగ్రహ నిమజ్జనం తర్వాత.. వ్యర్థాలను తొలగించేందుకు 'విసర్జన్ ఛార్జీలు' పేరుతో పౌరుల నుంచి వసూలు చేయాలని సూచించింది.