దిల్లీలో కొవిడ్-19 వ్యాప్తిని విశ్లేషించి.. వైరస్ను ఎదుర్కొనేందుకు వీలుగా విస్తృత వ్యూహాన్ని రూపొందించడానికి ఉద్దేశించిన సెరోలాజికల్ సర్వేను శనివారం నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.
జూన్ 21న హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గురువారం సమీక్షించిన తర్వాత ఆ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ ప్రకటన జారీ చేశారు. అజయ్ భల్లా నిర్వహించిన సమీక్షా సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యులు, ఎయిమ్స్, ఐసీఎంఆర్ డైరెక్టర్లు, దిల్లీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, వైద్య శాఖ కార్యదర్శులు హాజరయ్యారు.
"దిల్లీలో సెరోలాజికల్ సర్వే నిర్వహించడంపై చర్చించాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల ప్రకారం ఎన్సీడీసీ, దిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సర్వే నిర్వహిస్తాయి. జూన్ 27 నుంచి సర్వే ప్రారంభమవుతుంది. సర్వే బృందంలోని సభ్యులకు గురువారం శిక్షణ పూర్తయింది."
-కేంద్ర హోంశాఖ ప్రతినిధి
జనాభా క్లస్టర్లలో కొవిడ్ వ్యాప్తిని తెలుసుకోవడానికి ఆరోగ్య సేతు, ఇతిహాస్ మొబైల్ అప్లికేషన్లు సంయుక్తంగా ఉపయోగించడానికి హోంమంత్రి ఇదివరకే అనుమతులు ఇచ్చారని అధికారులు తెలిపారు. దిల్లీ ప్రభుత్వ జిల్లా బృందాలకు ఈ యాప్ల ఉపయోగానికి సంబంధించిన శిక్షణను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) గురువారం పూర్తి చేసినట్లు వెల్లడించారు.
జూన్ 27 నుంచి జులై 10 వరకు దిల్లీ అంతటా సెరోలాజికల్ సర్వే నిర్వహిస్తామని హోంశాఖ ఇదివరకే ప్రకటించింది. మొత్తం 20 వేల మంది నమూనాలను పరీక్షించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా నగరంలో కొవిడ్-19 వ్యాప్తిపై సమగ్ర విశ్లేషణ చేయడానికి అధికారులకు వీలు కలుగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫలితంగా మహమ్మారిని ఎదుర్కోవడానికి విస్తృత వ్యూహాలను తయారుచేసుకోవచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి- 'ఆత్మ నిర్భర్ యూపీ రోజ్గార్' ప్రారంభించిన మోదీ