దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నప్పటికీ.. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు అత్యల్పంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంది.
" ఇప్పటివరకు కొవిడ్-19 బారి నుంచి 60,490 మంది కోలుకున్నారు. రికవరీ రేటు క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం 41.61 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కేసులు ఉండి మరణాల రేటు అత్యల్పంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఈ రేటు ప్రస్తుతం 2.87గా ఉంది. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో కేసుల నమోదు రేటు అత్యల్పంగానే ఉంది. ప్రపంచంలో ప్రతి లక్ష మందిలో 69.9 కేసులు నమోదవుతుండగా.. భారత్‌లో ఆ సంఖ్య 10.7 మాత్రమే. లాక్డౌన్, భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటించటమే భారత్‌ను మెరుగైన స్థితిలో ఉంచింది. స్పెయిన్‌లో లక్షకు 504 కేసులు, బెల్జియంలో 499, అమెరికాలో 486 కేసులు నమోదయ్యాయి."
–లవ్ అగర్వాల్, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి.
డేటాను నమోదు చేయాలి..
హైడ్రాక్సీక్లోరోక్విన్ లభ్యత, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని జాతీయ కొవిడ్-19 వెబ్ పోర్టల్‌లో నవీకరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది కేంద్రం. దాని ద్వారా అవసరమైన రాష్ట్రాలకు మరిన్ని హెచ్‌సీక్యూ ట్యాబ్లెట్లను అందించటానికి ప్రణాళిక రచించేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాసింది. మే 22న విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఎంపిక చేసిన వర్గాల సిబ్బందికి హెచ్‌సీక్యూ ట్యాబ్లెట్లను ఇవ్వాలని లేఖలో పేర్కొంది.
ఆ 5 రాష్ట్రాలపై సమీక్ష..
గత మూడు వారాలుగా కొవిడ్-19 కేసులు భారీగా పెరుగుతోన్న 5 రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు భేటీ అయ్యారు. కంటైన్మెంట్ జోన్లలో పరిస్థితి, కట్టడి చర్యలపై విశ్లేషించారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులు, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్రాల డైరక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్. లాక్డౌన్ ఆంక్షల సడలింపు, అంతర్రాష్ట్రాల వలస కార్మికుల ప్రయాణాల అనుమతితో ఈ రాష్ట్రాల కేసుల్లో పెరుగుదల నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రులు, ఐసీయూ, వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలు వంటి ఆరోగ్య మౌలిక సదుపాయాలను అంచనా వేసి.. రానున్న రెండు నెలల అవసరాల కోసం వాటిని బలోపేతం చేయాని కోరాయి రాష్ట్రాలు.