గత రెండున్నర నెలల నుంచి గుజరాత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తొలినాళ్లలో కరోనా పరీక్షలు బాగానే ఉన్నా... గత కొన్ని రోజుల నుంచి టెస్టింగ్ తగ్గిపోయింది. తక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండటం గమనార్హం.
కేంద్ర వైద్య శాఖ గణాంకాల ప్రకారం (మే 28నాటికి) గుజరాత్లో 15,562 కరోనా కేసులు నమోదయ్యాయి. 8,003 మంది డిశ్చార్జి కాగా.. 960 మంది వైరస్‌తో పోరాడి తనువు చాలించారు. అత్యధిక కేసుల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది గుజరాత్. అయినప్పటికీ పరీక్షల సంఖ్యను తగ్గించడం గమనార్హం.
రోజుకు 5 వేల నమూనాలు పరీక్షిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం చెబుతుండగా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఈ అంశంపై 'ఈటీవీ భారత్' నిజనిర్ధరణ చేపట్టగా.. ప్రభుత్వ గణాంకాలతో పొంతన లేదని స్పష్టమైంది.
మే 24 నుంచి 28 వరకు నిర్వహించిన కరోనా టెస్టులు
మే 24: 4,802
మే 25: 3,492
మే 26: 2,952
మే 27: 4,550
మే 28: 4,185
ఈ గణాంకాలు పరిశీలిస్తే పరీక్షల సంఖ్య తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుజరాత్ వైద్య శాఖ చెబుతోంది. అయితే మార్గదర్శకాలను అనుసరించి పరీక్షల సంఖ్య తగ్గించినప్పుడు ఆ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
మరోవైపు లక్షణాలు కనిపించని వారికి పరీక్షలు నిర్వహించేది లేదని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి వారిని 10 రోజుల్లోగా వైరల్ పరీక్షలు నిర్వహించకుండానే డిశ్చార్జి చేయాలని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో 70 శాతం మందికి పాజిటివ్!
ప్రభుత్వం ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహిస్తే అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడతాయని, వారందరికి చికిత్స నిర్వహించడానికి సదుపాయాలు అందుబాటులో లేవని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తే రాష్ట్రంలోని 70 శాతం మందికి పాజిటివ్‌గా తేలే అవకాశం ఉందని గుజరాత్ హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. దీంతో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు తగ్గించడానికి ఈ వాదనను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.
ఆంక్షలు సడలింపు
రోజురోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. ఒకవేళ మే 31 తర్వాత కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తే మరిన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు విజయ్ రూపానీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ కేవలం కంటైన్మెంట్ జోన్లలోనే పూర్తి స్థాయిలో అమలు అవుతున్నట్లు 'ఈటీవీ భారత్' గుర్తించింది.
అహ్మదాబాద్ అతిపెద్ద హాట్‌స్పాట్
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 81 శాతానికి పైగా ఒక్క అహ్మదాబాద్ నగర పరిధిలోనే ఉన్నాయి. మే 25 నాటికి గుజరాత్‌లోని మొత్తం 14,063 కేసుల్లో 10,590 కేసులు అహ్మదాబాద్‌లో నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మే 25 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 888 మంది మరణించగా.. అందులో 722 మంది అహ్మదాబాద్‌లోనే ప్రాణాలు విడిచారు.
కేవలం అహ్మదాబాద్‌లోనే కేసులు గణనీయంగా పెరగడానికి గల కారణాలను 'ఈటీవీ భారత్' విశ్లేషించగా పలు వాస్తవాలు బయటపడ్డాయి.
అలసత్వమేనా?
కరోనా రోగులకు సరైన చికిత్స అందించకపోవడం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలోనే ఎక్కువ మంది కరోనా రోగులు మృతి చెందారు. సివిల్ ఆస్పత్రిలో సరైన చికిత్స అందించడం లేదని రోగులు సామజిక మాధ్యమాల్లో ఉంచిన వీడియోలు వైరల్‌గా మారాయి. కరోనా బాధితులకు చికిత్స అందించడానికి సీనియర్ వైద్యులు ముందుకు రావడం లేదని తెలిసింది. నర్సులు సైతం రోజుకు ఒక్కసారే బాధితులను పరిశీలించడానికి వస్తున్నట్లు వెల్లడైంది.\
ఇదీ చదవండి: ఆస్పత్రిలోకి నో ఎంట్రీ- 6 గంటలు రోడ్డుపైనే కరోనా రోగులు
ఈ విషయాన్ని గుజరాత్ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. సివిల్ ఆస్పత్రుల్లో చికిత్స విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోగులను జంతువుల్లా వదిలేయవద్దని ప్రభుత్వానికి హితవు పలికింది. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఆస్పత్రులను ఎన్నిసార్లు సందర్శించారో చెప్పాలని ప్రశ్నించింది.
దీంతో ప్రభుత్వం స్పందించి అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసింది. వైద్య సిబ్బంది లేనిదే బాధితుల బంధువులను ఆస్పత్రుల్లోకి అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ సివిల్ ఆస్పత్రి అలసత్వం వల్ల అప్పటికే పదుల సంఖ్యలో బాధితుల ప్రాణాలు పోయాయి.
మరోవైపు తీవ్రమైన కేసులనే సివిల్ ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారు. అధిక మరణాలు సంభవించడానికి ఇది కూడా ఓ కారణం.
అంతర్గత కలహాలు
సీనియర్ వైద్యులను కాదని డా. జేపీ మోదీని సివిల్ ఆస్పత్రి కొవిడ్-19 విభాగానికి ఇంఛార్జిగా నియమించడం వివాదానికి దారితీసింది. క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ విషయంలోనూ అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో సీనియర్ వైద్యుల మధ్య అంతర్గత కలహాలు పెచ్చుమీరాయి. ఇది కరోనా బాధితుల చికిత్సపై ప్రభావం చూపింది. రోగులపై అశ్రద్ధ వహిస్తున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వివాదాన్ని పరిష్కరించడానికి విశ్రాంత వైద్యుడు డా. ఎంఎం ప్రభాకర్‌ను పిలిపించింది. ఆలోపే మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
నకిలీ వెంటిలేటర్లు
రాజ్‌కోట్‌లోని జ్యోతి సీఎన్ఎస్ కంపెనీ తయారు చేసిన స్వదేశీ వెంటిలేటర్ల(ధమన్-1)ను సివిల్ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చారు. అయితే ధమన్-1 వెంటిలేటర్లలో ఉన్న లోపాల కారణంగా కొంతమంది పేషెంట్లు మరణించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సదుపాయాల కొరత
కేసులు పదుల సంఖ్యలో ఉన్నప్పుడు ప్రభుత్వం తమ సంసిద్ధత గురించి గొప్పగా చెప్పుకున్నా.. కొద్ది సమయంలోనే అసలు నిజం బయటపడింది. సరైన సదుపాయాలు, వైద్య సిబ్బంది సహా వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధించింది. దీంతో చాలా మంది బాధితులు చికిత్స మధ్యలోనే ప్రైవేటు ఆస్పత్రుల బాట పట్టాల్సి వచ్చింది.
ఖండించిన భాజపా
మరోవైపు, సివిల్ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు గుజరాత్ భాజపా ప్రతినిధి భరత్ పాండ్య స్పష్టం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులకు సైతం విజయవంతంగా నయం చేసి పంపిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వేలాది మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు. వైద్యుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని చెప్పుకొచ్చారు.
వాస్తవం తెలుసుకోవాలి
అయితే అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో ఎక్కువ మంది మరణించారన్న వాస్తవాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని, వాటి వెనక ఉన్న కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: రుతుపవనాల రాకపై ఐఎండీతో విభేదించిన స్కైమెట్