దేశరాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. పరీక్షలు పెంచిన నేపథ్యంలో గత మూడు వారాలుగా పాజిటివిటీ రేటు 30 శాతం నుంచి 10 శాతానికి పడిపోయినట్లు కేంద్రం ప్రకటించింది. గత నెల రోజులుగా రోజుకు సగటు నమూనాల పరీక్షలను 5,481నుంచి 18,766కు పెంచినట్లు వెల్లడించింది.
జాతీయ పాజిటివిటీ రేటు సైతం గణనీయంగా తగ్గిందని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం 6.73 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.
" కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సంయుక్తంగా, సమన్వయంతో కరోనా కట్టడి చర్యలు చేపడుతున్నాయి. సమన్వయంతో చేస్తున్న ప్రయత్నాలతో పరీక్షల సామర్థ్యం పెంపు, కరోనా బాధితుల గుర్తింపు, సరైన సమయంలో చికిత్స అందించటం వంటివి చేయగలుగుతున్నాం.ఈ చర్యల ఫలితంగా దేశంలో పాజిటివిటీ రేటు తగ్గుతోంది. ప్రస్తుతం జాతీయ పాజిటివిటీ రేటు 6.73గా ఉంది. దిల్లీలో ప్రస్తుతం 25వేల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 15వేల మంది వరకు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు."
- కేంద్ర ఆరోగ్య శాఖ.
దిల్లీలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలతో పాటు 30 నిమిషాల్లోనే ఫలితాలు ఇచ్చే కొత్త రాపిడ్ ఆంటిజెన్ పాయింట్ ఆఫ్ కేర్ (పీఓసీ) పరీక్షలను పెంచినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ.
జులై 5 వరకు ఉన్న సమాచారం ప్రకారం జాతీయ పాజిటివీ రేటు కన్నా తక్కువగా పుదుచ్చేరి(5.55), ఛండీగఢ్(4.36), అసోం(2.84), త్రిపుర(2.72), కర్ణాటక(2.64), రాజస్థాన్(2.52), గోవా(2.5), పంజాబ్(1.92) ఉన్నాయి.