కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ అమలు తీరు, కరోనా కేసుల నమోదుపై ఈ నెల 27న(సోమవారం) సమీక్షించనున్నారు మోదీ. అలాగే, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు, లాక్‌డౌన్ మినహాయింపుల అంశంపైనా ఆరా తీయనున్నారు.
క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకొని లాక్‌డౌన్‌ను ఎత్తేసే సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై కూడా సీఎంల నుంచి ప్రధాని సూచనలు కోరనున్నారు.
పొడిగింపు..
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశంలో ఇప్పటికే మే 3వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. మొదట ఏప్రిల్ 14 వరకు నిర్ణయించినా.. ఏప్రిల్ 11న సీఎంలతో సమావేశం అనంతరం లాక్‌డౌన్‌ను పొడిగించారు ప్రధాని. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీలో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగించాలని సూచించారు.
కరోనా అంశంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుండటం ఇది మూడోసారి. తొలుత లాక్‌డౌన్ విధించకముందు.. మార్చి 20న తొలిసారి సీఎంలతో సమావేశం అయ్యారు.