కరోనా బాధితుల కోసం పనిచేస్తున్న అత్యవసర సేవల సిబ్బందిలో నూతనోత్తేజం నింపేందుకు యత్నిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. శుక్రవారం సాయంత్రం మహారాష్ట్ర పుణెలోని నాయుడు ఆసుపత్రిలో సేవలందిస్తున్న నర్సు ఛాయకు ఫోన్ చేశారు. వైరస్ బాధితులకు సేవలందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో కొవిడ్-19 బాధితులకు అందుతున్న సేవలపట్ల ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ప్రధాని, నర్స్ మధ్య సంభాషణ వైరల్గా మారింది.
సంభాషణ సాగిందిలా..
'కరోనా బాధితులకు సేవలందిచడం పట్ల ఇంట్లో అభ్యంతరాలు ఎదురుకాలేదా?' అని ప్రధాని ప్రశ్నించారు. 'మా కుటుంబానికి ప్రమాదమన్న భయం ఉందని.. అయితే ఈ పరిస్థితిలో వారికి సేవలు అందించాలి. కుటుంబాన్ని ఒప్పించి పనిచేస్తున్నా. ఆందోళన చెందవద్దని రోగులకు సూచిస్తున్నా. వారి రిపోర్టులు నెగిటివ్గా వస్తాయని ధైర్యం చెబుతున్నా' అని ప్రధానికి సమాధానమిచ్చారు ఛాయ.
'మీలాగే ఎందరో నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వైద్యులు తపస్సులా సేవలందిస్తున్నారు.. మీ అనుభవాలు వినడం సంతోషంగా ఉంది' అని నర్సుతో అన్నారు మోదీ. 'నా విధులు నేను నిర్వర్తిస్తున్నా.. మీరు 24 గంటలు దేశం కోసం పనిచేస్తున్నారు.. మీతో మాట్లాడటం గర్వంగా ఉంది' అని ఆమె మోదీకి సమాధానమిచ్చారు.
ఇదీ చూడండి: కరోనా సోకిన 'జర్నలిస్ట్'పై కేసు నమోదు